కేరళలోని కోజికోడ్ ఎలత్తూర్ దగ్గర కదులుతున్న రైలులో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 8 మంది గాయపడ్డారు. ఈ ఘటనను NIA చాలా సీరియస్ గా తీసుకుంది. నలుగురు అధికారులతో కూడిన బృందం దర్యాప్తును కూడా ప్రారంభించింది. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించిన అనుమానితుడి ఊహా చిత్రాన్ని కూడా రైల్వే శాఖ విడుదల చేసింది. సీసీటీవీతో పాటు ప్రయాణికుల నుంచి కూడా వివరాలు సేకరించి, ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మరోవైపు అలప్పుళ-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు లో ఆదివారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలు కోజికోడ్ నగరం దాటి కోరపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే డీ1 కంపార్ట్‌మెంట్‌లోని ఓ గుర్తు తెలియని వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే మంటలు తోటి ప్రయాణికులకు అంటుకున్నాయి. మరోవైపు ఈ ఘాతుకానికి పాల్పడింది నోయిడాకి చెందిన షారూఖ్ షరీఫ్ అని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చేశారు. ఇప్పటికే ఓ ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షారూఖ్ షరీఫ్ కి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు.
నిందితుడు ఫారూఖ్ అలప్పుళ-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ బోగీలో ప్రయాణించాడు. ఘటన జరిగింది డీ1 ఎగ్జిక్యూటివ్ బోగీ. ఈ బోగీలో ప్రయాణికుల పేర్లను ముందే గుర్తించిన ఫారూఖ్.. పక్కా వ్యూహంతోనే ఈ దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా మళప్పురం క్రైమ్‌బ్రాంచ ఎస్పీ పి.విక్రమన్‌ను నియమించింది. ఈ బృందంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ATS) డీఎస్పీ బైజోపాలోస్ కూడా ఉన్నారు.