నమీబియా చీతాలకు పేర్లు పెట్టండి… ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ

నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలకు పేర్లు పెట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీని కోసం పోటీలు కూడా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఆదివారం మన్ కీ బాత్ లో భాగంగా మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చీతాలు భారత్ లో అడుగు పెట్టడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అదే రకంగా గర్వంగా కూడా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చీతాలన్నీ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణలో వున్నాయని, చీతాలకు పేరు పెట్టే ఛాన్స్ ప్రజలకే ఇస్తున్నామని ప్రకటించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు తగిన విధంగా చీతాలకు పేర్లు సూచించాలని విజ్ఞప్తి చేశారు. మంచి పేరు సూచించిన వారిని ఎంపిక చేసి.. చీతాలను చూసే తొలి అవకాశం కల్పిస్తామన్నారు.

 

ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షియోపూర్ జిల్లాలో గల కునో పార్క్ లో 8 చిరుతలను ప్రధాని వదిలారు. ఈ చిరుతలు ఆఫ్రికాలోని న‌మీబియా నుంచి తెప్పించారు. ప్ర‌త్యేక విమానంలో ఆ చిరుతలను గ్వాలియ‌ర్‌కు తీసుకువ‌చ్చారు. గ్వాలియ‌ర్‌లోని ఐఏఎఫ్ విమానాశ్ర‌యంలో ప్ర‌త్యేక విమానంలో చిరుతలకు స్వ‌ల్ప స్థాయిలో మ‌త్తు ఇచ్చి తీసుకువ‌చ్చారు. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకువచ్చారు. రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చిరుతలను ఇండియాకు తీసుకువచ్చారు. వీటిని తీసుకురావడానికి బీ747 జంబో జెట్‌కు మార్పులు చేశారు. అయితే ఈ విమానం ముఖ భాగాన్ని ఫులి ముఖంతో డిజైన్ చేసిన ఫొటోను ఇప్పటికే అక్కడి ఇండియన్ కమిషన్ విడుదల చేసింది.

 

 

Related Posts

Latest News Updates