రక్షణ రంగంలో స్వావలంబన సాధించి, రక్షణ పరికరాల ఎగుమతులు ఎక్కువ చేయడానికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత రక్షణ దళాలు ఉపయోగించే ఉత్పత్తుల్లో అధిక శాతం దేశీయంగా తయారైనవే అని మోదీ గుర్తు చేశారు. ఇది ఆత్మ నిర్భర భారత్ సత్తాకు నిదర్శనమన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఎక్స్‌పో-2022ను బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రక్షణ రంగంలో భారత్ సాధించిన పురోగతి, విజయాల గురించి మోదీ ప్రస్తావించారు. స్వదేశంలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉన్న వస్తువులతో రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిందని, 2020 ఆగస్టు 21, 2021 మే 31, 2022 ఏప్రిల్ 07 తేదీల్లో 310 వస్తువులతో మూడు జాబితాలు విడుదల అయ్యాయని అన్నారు. తాజాగా 4వ జాబితాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో 2022 లో విడుదల చేశారు.