హనుమంతుడి లాగే బీజేపీ కార్యకర్తలు కూడా సాధించాలి : ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించారు. మరోవైపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వర్చువల్ గా సంభాషించారు. హనుమజ్జయంతి రోజునే పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు. హనుమాన్ చేయలేనిది అంటూ ఏదీ లేదని.. అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా తలచుకుంటే ఏదైనా సాధించగలరన్నారని పేర్కొన్నారు. హనుమాన్ నుంచి స్ఫూర్తి పొంది బీజేపీ అవినీతిపై పోరాడుతోందన్నారు.

 

ఆ హనుమంతుడి లాగే ఏ సవాల్ నైనా ఎదుర్కొనేందుకు అందరూ సంసిద్ధంగా వుండాలని పిలుపునిచ్చారు. నిస్వార్థమైన సేవా మార్గానే పార్టీ విశ్వసిస్తుందని, దేశ సంక్షేమం కోసం కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు కూడా వెనకడుగు వేయమన్నారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి, శాంతిభద్రతల సవాళ్ల నుంచి భారత్ కి విముక్తి కల్పించాలన్న దానికి ఇంకా కట్టుబడే వున్నామని స్పష్టం చేశారు. తమ తమ అస్తిత్వం కోసం పోరాడుతున్న కొన్ని పార్టీలు… బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూనే వున్నాయని విమర్శించారు.

 

బీజేపీకి అన్నిటి కన్నా దేశమే ముఖ్యమని, హనుమంతుడు పాటించిన విలువలు, ఆయన బోధనల నుంచి బీజేపీ, దాని కార్యకర్తలు నిరంతరం ప్రేరణ పొందుతారని చెప్పారు. సముద్రమంతటి సవాళ్ళనైనా ఎదుర్కొనేంత బలంగా భారత దేశం ఎదిగిందని చెప్పారు. అధికరణ 370 గత చరిత్ర అవుతుందని ప్రతిపక్షాలు ఎన్నడూ ఊహించలేదన్నారు. బీజేపీ చేస్తున్న కృషిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. ప్రతిపక్షాలు చాలా నిరాశతో ఉన్నాయని ఎద్దేవా చేశారు.

Related Posts

Latest News Updates