సూడాన్లో సైన్యం, పారామిలటరీ దళాల మధ్య పోరు సాగుతుండటంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతను శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేగంగా మారుతున్న సూడాన్ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయులను వేగంగా తరలించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.
అంతేకాకుండా సూడాన్ ఇరుగు పొరుగు దేశాలతోనూ సంభాషణలను కొనసాగించానలి, అందుకు తగ్గ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, సూడాన్ భారతీయులతో ఎప్పటికప్పుడు టచ్ లో వుండాలని సూచించినట్లు పీఎంవో ట్వీట్ చేసింది. ఇక… సూడాన్ లో సైన్యం, పాలమిటరీ బలగాల మధ్య ఘర్షణలో మరణించిన వారికి మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సూడాన్ లోని భారతీయుల భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని కూడా మోదీ అధికారులకు సూచించారు.
కాగా, సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందర్ బాగ్చి తెలిపారు. వివిధ మాధ్యమాల ద్వారా సూడాన్‌లోని భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు అడ్వయిజరీలు జారీ చేస్తున్నామని అన్నారు. పారామిటలరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన సూడాన్‌లోని ఆర్మీ-పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ విషయంలో సైన్యాధినేత అబ్దెల్ ఫథా అల్ బుర్హాన్, పారామిలటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్రో మధ్య కొద్దికాలంగా నెలకొన్న విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి.
ఇక… సైన్యం, పారామిలటరీ మధ్య ఘర్షణతో సూడాన్ అట్టుడుకిపోతోంది. ఈ రెండు దళాలకు చెందిన ఉన్నతాధికారుల మధ్య విభేదాలు చివరికి ఇంత స్థాయికి తెచ్చి పెట్టాయి. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్ బుర్హాన్, పారామిలటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య విభేదాలు రావణ కాష్టంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖార్టూమ్ నగరంలో మరీ ఎక్కువైంది. దీంతో ఇప్పటి వరకూ 350 మందికి పైగా మరణించారు. ఐ.రా.స సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు.