చలికాలంలోనూ రామగుండం ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12 న రామగుండం ప్రాంతానికి రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పున: ప్రారంభించనున్నారు. అయితే… ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను కేంద్రం అసలు ఆహ్వానించలేదని టీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. ఇదేం పద్ధతి? అంటూ విరుచుకుపడుతోంది. అయితే… దీనిని బీజేపీ తప్పుబట్టింది. రామగుండం కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఈ నెల 2 నే తాము సీఎం కేసీఆర్ కి ఆహ్వానం పంపామని బీజేపీ వెల్లడించింది. కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సీఎం కేసీఆర్ ని ఆహ్వానిస్తూ లేఖ రాశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విమర్శల నేపథ్యంలోనే కీలక పరిణామం జరిగింది. కేంద్రం నుంచి కేసీఆర్ కి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి సీఎం కేసీఆర్ ని కోరారు. ఇప్పుడు… సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తిగా నెలకొంది.

 

ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ని కేంద్రం దూరంపెట్టిందని అధికార టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే… ఇంతకు ముందు 3 సార్లు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. కానీ… ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదు. ముచ్చింతల్ వేదికగా సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ హైదరాబాద్ కి వస్తే, సీఎం కేసీఆర్ కి జ్వరం వుందని, ఆయన రాలేరని సీఎంవో పేర్కొంది. ఆ తర్వాత మే 26 న ఐఎస్ బీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్ వస్తే… కేసీఆర్ బెంగళూరు వెళ్లిపోయారు. మూడో సారి ప్రధాని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ కి వస్తే కేసీఆర్ అప్పుడు కూడా వెళ్లలేదు. ప్రతి సారీ సీఎం కేసీఆర్ వంతు రాష్ట్ర మంత్రి తలసాని వెళ్లారు.

 

 

ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని వామపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. వారికి ఆల్ యూనివర్శిటీ స్టూడెంట్ జేఏసీ గొంతు కలిపింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ఆ హామీ నెరవ్చేలేదని, ‘యూనివర్సిటీ కామన్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు’ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే, కేంద్రం ఆదేశాలతోనే గవర్నర్‌‌‌‌ ఆ బిల్లును తొక్కి పెట్టారని దుయ్యబడుతున్నది. తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్న మోడీ రామగుండం టూర్‌‌‌‌ను అగ్నిగుండం చేస్తామని ప్రకటించింది.