న్యూఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, ప్రధాని మోదీ హైదరాబాద్ హౌజ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. అయితే… ఆస్ట్రేలియాలోని దేవాలయాల ధ్వంసం గురించి ప్రధాని మోదీ నేరుగానే ప్రస్తావించారు. ఆస్ట్రేలియాలో తరుచుగా ఆలయాల విధ్వంసం జరుగుతోందన్న వార్తలు వింటున్నామని, చాలా విచారకరమని మోదీ నిర్మొహమాటంగా ప్రస్తావించారు. ఈ విషయంలో భారతీయ కమ్యూనిటీలకు భద్రత కల్పిస్తామని ప్రధాని అల్బనీస్ తనకు హామీ ఇచ్చినట్లు మోదీ వెల్లడించారు. ఈ విషయం తమకు తెలిసిందని, దీనిపై చర్యలు తీసుకుంటానని, భారతీయ కమ్యూనిటీల భద్రత, శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ వేర్పాటువాదులు హిందూ ఆలయాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. గత వారం బ్రిస్బేన్ లోని ప్రముఖ హిందూ ఆలయం లక్ష్మీ నారాయణ్ ఆలయంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని రంగాల్లో సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. స్పోర్ట్స్, ఆడియో విజువల్ కో ప్రొడక్షన, సోలార్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన విషయాల్లో ఎంవోయూలు జరిగాయి. ఇక… సెప్టెంబర్ లో జరగనున్న జీ 20 సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధానిని భారత్ కు ఆహ్వానించామని మోదీ ప్రకటించారు. క్వాడ్‌లో భారత్, ఆస్ట్రేలియా రెండూ సభ్య దేశాలని, క్వాడ్ సదస్సుకు తనను ఆస్ట్రేలియాకి ఆహ్వానించినందుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో భద్రతా సహకారం ఒక ముఖ్యమైన విషయమని మోదీ అన్నారు.












