జపాన్ దివంగత ప్రధాని షింజో అబే అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ సోమవారం రాత్రి టోక్యో బయల్దేరారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత మోదీ అబే కుటుంబీకులను కలుసుకుంటారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటించారు. మరోవైపు అంత్యక్రియలకు హాజరయ్యే ముందు ప్రధాని మోదీ జపాన్ ప్రధాని కిషిదాతో జరిగే ద్వైపాక్షిక సమావేశానికి హాజరవుతారు. జపాన్‌లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన షింజో అబే జూలై 8న పశ్చిమ జపాన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా హత్యకు గురయ్యారు.
నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అబేకు గౌరవసూచకంగా జూలై 9న భారతదేశం ఒకరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. షింజో అబే అంత్యక్రియల కోసం జపాన్ ప్రభుత్వం సుమారుగా 11 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అబెకు తుది వీడ్కోలు పలికేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో సహా… 100 కు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో 18 వేల మంది సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.