మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సిరిసిల్లా జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు ఎల్ది హరిప్రసాద్ ప్రస్తావన తెచ్చారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. తన స్వహస్తాలతో నేసిన జీ 20 లోగోను హరిప్రసాద్ అనే సోదరుడు తనకు పంపారని, ఆ అద్భుతాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని ప్రధాని వెల్లడించారు. తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే నైపుణ్యం హరిప్రసాద్‌కు ఉంది. చేతితో నేసిన జీ-20 లోగోతో పాటు హరిప్రసాద్‌ నాకు ఒక లేఖ పంపారు. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని లేఖలో రాశారని మోదీ గుర్తు చేసుకున్నారు. తెలంగాణలోని ఒక జిల్లాకు చెందిన వ్యక్తి కూడా జీ-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో అనుసంధానం కావడం చూసి చాలా సంతోషించా. మన దేశం జీ-20 సదస్సును నిర్వహించడం గర్వకారణం అని తెలిపారు.

శక్తిమంతమైన జీ-20 దేశాల కూటమికి అధ్యక్షత వహించడం భారత్‌కు అందివచ్చిన గొప్ప అవకాశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచహితం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. వసుధైక కుటుంబం అన్న మంత్రంతో ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకటే భవిష్యత్‌ అన్న భావనను జీ-20కి కల్పించామని మోదీ తెలిపారు. దీన్ని ప్రపంచ సంక్షేమానికి, ప్రయోజనానికి మనం పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ సంక్షేమం.. అందరికీ శాంతి.. అందరి ఆకాంక్షలు నెరవేరాలన్నారు.

 

విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగంపై కూడా మోదీ తన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగం అంతరిక్ష రంగంలో ఓ నూతన సూర్యోదయంగా మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంతో దేశ అంతరిక్ష రంగంలో నూతన శకం మొదలైందని ప్రటించారు. దేశీయంగా ప్రైవేట్ రంగంలో డిజైన్ చేసి, రూపొందించిన తొలి రాకెట్ విక్రమ్ ఎస్ నింగిలోకి దూసుకెళ్లిందని, ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా పొంగిపోయిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కాగితాలపై ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలను గీసిన మనవారు, ఇప్పుడు రాకెట్లను తయారు చేస్తున్నారని మోదీ పేర్కొన్నారు.