ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబేన్ ఉదయం కన్నుమూశారు. తల్లి చనిపోయిందన్న పుట్టెడు దు:ఖంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ తన విధులను మాత్రం మరువలేదు. ఆ బాధను దిగమింగుకొని… కర్తవ్య నిష్ఠలో లీనమయ్యారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లి హీరాబేన్ చితికి నిప్పు పెట్టి, అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాత మోదీ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగాల్ లో వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం నేడు మోదీ బెంగాల్ పర్యటనకు వెళ్లాల్సి వుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ సహా.. పలు అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని షెడ్యూల్ ఖరారైంది.
అయితే… శుక్రవారం హఠాత్తుగా తల్లి హీరాబేన్ మరణించడంతో మోదీ అహ్మదాబాద్ వెళ్లి… పుత్రుడిగా చేయాల్సిన విధిని నిర్వర్తించారు. వర్చువల్ గా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సుబేందు అధికారి, గవర్నర్, కేంద్ర రైల్వే మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత కోల్ కతాలో జరిగే గంగా మండలి సమావేశానికి కూడా మోదీ వర్చువల్ గా హాజరయ్యారు.