అగ్నిపథ్ మొదటి బ్యాచ్ తో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా సంభాషించారు. ఈ సందర్భంగా వారందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. అగ్నిపథ్ కి మార్గదర్శకులు మీరే అంటూ అభినందించారు. అగ్నిపథ్ స్కీం సాయుధ బలగాలను పటిష్టం చేయడంలో ఓ గేమ్ ఛేంజర్ గా మారుతుందని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుందని అన్నారు. యువ అగ్నివీరులు సాయుధ దళాలను మరింత యువ ఉత్సాహం, సాంకేతికతతో సాయుధ దళాలను మరింత శక్తిమంతం చేస్తారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
సాయుధ బలగాల ధైర్య సాహసాలకు అగ్నివీరులు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు.అగ్నివీర్ శిక్షణ ద్వారా వచ్చిన అనుభవాన్ని చూసుకుంటే చాలా గౌరవంగా వుంటుందని మోదీ అన్నారు. నవ భారతం పూర్తిగా నూతన శక్తితో వుందని, బలగాలను ఆధునీకరించుకోవడంతో పాటు వాటిని ఆత్మనిర్భర్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. 21 వ శతాబ్దంలో యుద్ధాల తీరు పూర్తిగా మారిపోతుందని, సాంకేతికంగా ముందంజలో వుండే సైనికులదే ముఖ్య భూమిక అని మోదీ వివరించారు. త్రివిధ దళాల్లో మహిళా అగ్నివీరులను చూసేందుకు తాను ఎదురు చూస్తున్నానని మోదీ అన్నారు.