సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా ఈ అంశంపై కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. బొగ్గు గనులను కేంద్రంగా చేసుకొని, కొన్ని కోట్ల అవినీతి జరగడం చూశామని, కానీ.. తమ అధికారంలో బొగ్గు గనుల విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని వివరించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ అక్కడి బహిరంగ సభలో ప్రసంగించారు. సింగరేణిలో రాష్ట్రం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం అని, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని మోదీ స్పష్టం చేశారు. బొగ్గు గనులపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రామగుండం సభకు రైతులతో పాటు, ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చారని, దీంతో హైదరాబాద్ లో వుంటున్న వారికి నిద్ర పట్టదని పరోక్షంగా టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు.

 

సభకు వచ్చిన రైతులు అంటూ… తెలుగులో ఉపన్యాసం ప్రారంభించిన మోదీ

రామగుండం గడ్డ మీది నుంచి తెలంగాణ ప్రజలందరికీ నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు వచ్చిన రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకూ నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. అలాగే 2,268 కోట్లత చేపట్టే మెదక్ సిద్దిపేట- ఎల్కతుర్తి హైవే విస్తరణ పనులు, బోధన్-బాసర- భైంసా హైవే పనులకు శంకు స్థాపన చేశారు. ఫర్టిలైజర్, రైల్వే లైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తాము శంకుస్థాపనలకే పరిమితం కాలేదని, అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలోనూ వేగం పెంచామన్నారు.

 

రామగుండం ఎరువుల కర్మాగారానికి 2016 లో శంకుస్థాపన చేశామని, కర్మాగారాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేశామని వివరించారు. 2014 కంటే ముందు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవారని, తాము అధికారం లోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చూశామన్నారు. భవిష్యత్ లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందని పునరుద్ఘాటించారు. తాము తీసుకున్న చర్యలతో యూరియా నల్లబజారు మార్కెట్ ఆగిపోయిందన్నారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టామని, 5 ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతోందని మోదీ వివరించారు.