ప్రధాని నరేంద్ర మోదీ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి ఫోన్ చేసి, పరామర్శించారు. ఇటీవల ఆమె విషయంలో తెలంగాణలో జరిగిన ఘటనలపై ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు.దాదాపు 10 నిమిషాల పాటు ప్రధాని మోదీ వైఎస్ షర్మిలతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై మాట్లాడడానికి ఢిల్లీకి రావాలని షర్మిలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

ఇటీవల వైఎస్.షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రోజు ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో దీనికి నిరసనగా మరుసటి రోజు ప్రగతి భవన్ వద్ద దీక్ష చేపట్టేందుకు షర్మిల కారులో బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. క్రేన్ ద్వారా కారుతోసహా షర్మిలను అదుపులోకి తీసుకెళ్లారు. ఆమెను ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉంచి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత నాంపల్లి కోర్టులో హాజరపర్చగా, కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది.