ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టమని తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషంగా ఉందని, తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందని మోదీ అన్నారు. హైదరాబాద్ కి వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో కార్యకర్తలతో మాట్లాడాలని అధ్యక్షుడు బండి సంజయ్ కోరారని, తాను కూడా అందరిలాగే బీజేపీలో చిన్న కార్యకర్తను అని మోదీ ప్రకటించుకున్నారు. తెలంగాణ కార్యకర్తలను చూసి స్ఫూర్తి పొందానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెడుతున్నా బీజేపీ కార్యకర్తలు భయపడడం లేదన్నారు. అణిచివేతకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటం కొనసాగుతోందని చెప్పారు. పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు.

 

మునుగోడు ప్రజలు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని అన్నారు. ఒక్క అసెంబ్లీ సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వం మెత్తం మునుగోడులో మకాం వేసిందంటూ మోదీ ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధకారం ఎక్కువ రోజులు వుండదని, తెలంగాణలో కమలం వికసిస్తుందన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే అని ప్రజలు చాటి చెప్పారని అన్నారు. కమ్యూనిస్టులు అభివృద్ధి, సామాజిక న్యాయానికి వ్యతిరేకులని ,అలాంటి వారితో టీఆర్ఎస్ చేతులు కలిపిందని విమర్శించారు. ప్రజలను లూటీ చేసే వారు ఎవరైనా సరే.. వదిలిపెట్టమని హెచ్చరించారు. తనను, బీజేపీని తిట్టినా భరిస్తాను కానీ.. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం సహించనని చెప్పారు. 22 ఏళ్లుగా తాను తిట్లు తింటూనే ఉన్నానని, ఆ తిట్లే తనకు బలంగా మారుతున్నాయని చెప్పారు.