నేడు గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం… హాజరు కానున్న 200 మంది సాధువులు

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గాంధీనగర్ లోని కొత్త సెక్రెటేరియట్ సమీపంలో వుండే గ్రౌండ్ లో రాష్ట్ర గవర్నర్ దేవవ్రత్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. భూపేంద్ర పటేల్ తో పాటు మరికొందరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తైనట్లు బీజేపీ ప్రకటించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 182 సీట్లకు గాను… ఏకంగా 156 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఏకంగా 53శాతం ఓటు బ్యాంకును సాధించుకుంది. ఈ నేపథ్యంలో శనివారం బీజేపీ శాసనసభా పక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి పరిశీలకులుగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్, కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప పరిశీలకులుగా వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరూ శాసనసభా పక్ష నాయకుడిగా తిరిగి భూపేంద్ర పటేల్ ను ఎన్నుకున్నారు.

ఇప్పటికే అహ్మదాబాద్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఇప్పటికే ప్రధాని అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఆదివారం రాత్రికి చేరుకున్న ప్రధాని మోదీకి… ప్రజలు రోడ్డుకిరువైపులా నిల్చుని ఘన స్వాగతం పలికారు. ఇక… కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. వీరితో పాటు 200 మంది సాధువులు కూడా హాజరవుతున్నారు.

Related Posts

Latest News Updates