గుజరాత్‌లోని కెవాడియా వద్ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ పరేడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కెవాడియాలోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద సర్దార్ పటేల్‌కు మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భౌతికంగా తాను ఈ పరేడ్ లో పాల్గొంటున్నా… తన మనసంతా మోర్బీ బాధితులపైనే వుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో చాలా అరుదుగా ఇంతటి బాధను అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఓ వైపు భారమైన హృదయం, మరో వైపు విధి నిర్వహణ… ఈ రెండింటి మధ్య తాను విధులు నిర్వర్తిస్తున్నానని అన్నారు. మోర్బీ వంతెన కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.

ఈ దుఃఖ సమయంలో, ప్రభుత్వం అన్ని విధాలుగా మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని పరేడ్ వేదికగా మోదీ హామీ ఇచ్చారు. ఘటన జరిగిన సమయం నుంచే రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయపడుతోందని అన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి విషయంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోందన్నారు.

స్వాతంత్ర పోరాట సమయంలో పటేల్ లాంటి ఉక్కు మనిషి నాయకత్వం దేశానికి లేకపోతే… ఏం జరిగి వుండేదో ఊహించుకోడానికే గగనంగా వుందని ప్రధాని మోదీ అన్నారు. 550కి పైగా సంస్థానాల విలీనం కాకపోతే ఏం జరిగి వుండేదో అని అన్నారు. భారత్ పురోగమిస్తున్నదని తీవ్రంగా కలత చెందే వ్యక్తులు వున్నారని, గతంలో కూడా వుండేవారని గుర్తు చేశారు. ప్రజల్ని విచ్ఛిన్నం చేయడానికి, విభజించడానికి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని, మోదీ విమర్శించారు.












