దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పీఎంవో అధికారులు, ఇతర శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం వున్న కోవిడ్ కేసుల సంఖ్య ప్రధాని మోదీకి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రద్దీ ప్రాంతాల్లో అందరూ మాస్క్ ధరించేలా చూడాలని మోదీ సూచించారు. ఆస్పత్రుల్లో రోగులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలని పేర్కొన్నారు.

అలాగే ల్యాబ్స్ లో జీనోమ్ సీక్వెన్సింగ్ ను మెరుగుపరచాలని సూచించారు. దీని వల్ల కొత్త వేరియంట్లను ట్రాక్ చేయడానికి సులభమవుతుందన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ పై దృష్టి నిలపాలన్నారు. ఆస్పత్రుల్లో మరిన్ని సౌకర్యాలు పెంచాలని, ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ వుండాలన్నారు. ఇన్ ఫ్లుయెంజా, కోవిడ్ కోసం అవసరమైన డ్రగ్స్, లాజిస్టిక్స్, బెడ్స్, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో వుండాలన్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తూ వుండాలని, దేశంలోని ఆస్పత్రులు అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా వుండాలని మోదీ సూచించారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొంత కాలంగా 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో చత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మరణించారు. ఎక్స్‌బీబీ1.16 కరోనా కొత్త వేరియంట్ తో ఈ నెల 20వ తేదీ వరకు మహారాష్ట్రలో 104 కేసులు, కర్ణాటకలో 57, గుజరాత్‌లో 54, ఢిల్లీలో 19, పుదుచ్చేరిలో 7, హరియాణాలో 6, హిమాచల్ ప్రదేశ్‌లో 3 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 93 నమోదయ్యాయి.












