ఈడీ విచారణకు హాజరు కావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చివరన ట్విస్ట్ ఇచ్చారు. అయ్యప్ప మాలలో వున్నందున తాను విచారణకు రాలేనని, సంక్రాంతి తర్వాత విచారణకు వస్తానని ఈడీకి ఓ లేఖ రాశారు. ఈ మేరకు ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్యే పీఏ శ్రవణ్ వెళ్లి లేఖ అందజేశారు. అంతేకాకుండా సమయం కూడా చాలా తక్కువగా ఇచ్చారని, సెలవుల కారణంగా బ్యాంక్ స్టేట్ మెంట్స్ తీసుకు వచ్చేందుకు ఇబ్బందిగా వుందన్నారు. ఈడీ చెప్పిన ప్రకారం డాక్యుమెంట్లు కొన్ని మాత్రమే వున్నాయని, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేదని పీఏ ఈడీకి తెలిపారు.
వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు 2015 నుంచి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను అందించాలని ఈడీ ఆయనను ఆదేశించింది. అయితే… ఈడీ విచారణకంటూ బయల్దేరిన ఎమ్మెల్యే పైలట్… సీఎం కేసీఆర్ తో భేటీ కావడానికి ప్రగతి భవన్ కి వెళ్లారు. అక్కడ సీఎంతో చర్చించారు. ప్రగతి భవన్ వెళ్లి, సీఎం కేసీఆర్ తో చర్చించిన తర్వాతే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మనసు మార్చుకున్నారు. తాను విచారణకు హాజరవ్వడం లేదని ట్విస్ట్ ఇచ్చారు.