దేశంలో ఉగ్రవాద శిక్షణలు నిర్వహిస్తూ, యువతను ఉగ్రవాదంవైపు తీసుకెళ్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై కేంద్రం నిషేధం విధించింది. 5 సంవత్సరాల పాటు దేశంలో పీఎఫ్ఐ పై బ్యాన్ వుంటుందని కేంద్రం హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంఘాలైన రెహబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఎఫ్ఐ), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆలిండియా ఇమామ్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫడెరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్స్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రెహబ్ ఫౌండేషన్ పై కూడా కేంద్ర హోంశాఖ బ్యాన్ విధించింది.
దేశంలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటూ, ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులతో సత్సంబంధాలున్న పీఎఫ్ఐపై నిషేధం విధించాలని చాలా రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే వున్నాయి. ఈ డిమాండ్ ను ఆధారంగా చేసుకొనే కేంద్రం పీఎఫ్ఐ పై 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఇప్పటికే ఎన్ఐఏ, ఈడీ కలిపి దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై మెరుపు దాడులు నిర్వహించింది. దాదాపు 400 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్ లు చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద నిషేధం తక్షణమే అమలులోకి వచ్చేలా చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ తన నోటిఫికేషన్ లో తేల్చి చెప్పింది. పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, ఇవి దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారం, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని, దేశంలో శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నాయని కేంద్రం తెలిపింది.