రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలపై సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణ పీసీసీ నేతలు కలుసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ నేతలు సీఎస్ కు మోమోరండం సమర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ధరణిని రద్దు చేసి పాతపద్ధతిని తీసుకురావాలని, నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు, భూ సమస్యలపై సీఎస్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కూర్చోడానికి సచివాలయం లేదు. కలవడానికి సీఏం లేరని విమర్శించారు.

ధరణి పోర్టల్ వల్ల ఆస్తుల వివరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల నుంచి దుర్వినియోగం జరుగుతోందని విమర్శించారు. ధరణి పోర్టల్ రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భూములున్న ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం కొల్లగొట్టిందని, పోడుభూములకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనుల పొట్ట కొడుతోందని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో ఆఫీసుల ముందు బాధితులతో నిరసన కార్యక్రమాలు చేపడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.