దత్తత పేరుతో మంత్రి కేటీఆర్ మునుగోడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని మంత్రి కేటీఆర్ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ‘నిన్ను.. నీ అయ్యను.. నీ బావను అధికారంలోకి తీసుకువచ్చింది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేయడం కోసం’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు బై పోల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి రేవంత్ సంస్థాన్ నారాయణపురం ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మునుగోడులో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీఆర్‌ఎస్, బీజేపీలకు జనం బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మునుగోడులో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు గెలిస్తే ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏదీ లేదన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పిన రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌లు ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని సవాల్ చేశారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప, టీఆర్ఎస్ కొత్తగా చేసిందేమీ లేదని రేవంత్ అన్నారు. మునుగోడు బంగారుమయం కాలేదని, రోడ్లన్నీ గుంతల రోడ్లుగా మారిపోయాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయిందని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నించారు.