కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కామెంట్లు చేసిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వెల్లడించారు. మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదన్నారు. తెలంగాణలో ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అంతేకాక బీఆర్‌ఎస్‌తో పొత్తు వుండదని రాహుల్‌గాంధీ చాలా క్లియర్‌గా చెప్పారని గుర్తుచేశారు.
కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిలికి కాంగ్రెస్ బలి కాదాల్చుకొలేదన్నారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం రాకుండా ఆప్‌కి కేసీఆర్ డబ్బులు ఇచ్చాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఈ సారి ప్రజలు 80 సీట్లు కట్టబెడతారని చెప్పారు. ఈ సారి కేసీఆర్ కు 25 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు. ఎవరినైనా క్షమిస్తాం కానీ… కేసీఆర్ ను మాత్రం క్షమించే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్,ఎంఐఎం మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ వుందని, బీజేపీతో పోరాడుతున్నట్లు నటించి, కాంగ్రెస్ ను మింగేస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు.