పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ములుగు జిల్లాలో సాగుతోంది. ఈ సందర్భంగా ములుగులో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన దుమారానికి, చర్చకు దారితీశాయి. ప్రగతి భవన్ ని నక్సలైట్లు పేల్చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు, ప్రజలకు ప్రగతి భవన్ ఏమాత్రం ఉపయోగపడదని, అలాంటప్పుడు ఆ ప్రగతి భవన్ ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్‌ను కూడా పేల్చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ అవసరం లేదని, మావోయిస్టులు దానిని డైనమేట్లతో పేల్చేయాలన్నారు. ప్రగతి భవన్ లోకి ప్రజలకు ప్రవేశం లేదని, కేవలం ఆంధ్ర పెట్టుబడిదారులకు మాత్రమే ప్రవేశం వుంటుందని ఎద్దేవా చేశారు.

 

తీవ్రంగా స్పందిస్తున్న బీఆర్ఎస్ నేతలు

మరోవైపు రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రగతిభవన్‌ను కూల్చివేయాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ… ములుగు, నర్సంపేట పోలీస్‌స్టేషన్లలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ప్రగతిభవన్‌ను డైనమేట్లు పెట్టి పేల్చాలన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రేవంత్‌ను జైల్లో పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతల వైఖరి ఏంటంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

అయితే…. బీఆర్ఎస్ నేతలు తమపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తాను కేసులకు భయపడనని స్పష్టం చేశారు. తనకు పోలీసు కేసులు కొత్తేమీ కాదని అన్నారు. కేసీఆర్ భూతం లాంటివారని, పట్టి సీసాలో బంధించాలని అన్నారు. లేదంటే తట్టుకోలేమంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ తమకు మద్దతివ్వాలని రేవంత్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, తెలంగాణ మంత్రి వర్గంలో 90 శాతం మంది తెలంగాణ ద్రోహులే వున్నారని మండిపడ్డారు.