నూతన పార్లమెంట్ భవనం ఫొటోలు వచ్చేశాయి. సెంట్రల్ విస్టా అధికారిక వెబ్ సైట్లో కేంద్ర ప్రభుత్వం ఫొటోలను పోస్ట్ చేసింది. కొత్త పార్లమెంట్ భవనం లోపల ఎలా వుంటుందో.. ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. పెద్ద పెద్ద హాళ్లు, విశాలమైన పార్కింగ్ స్థలం, పెద్ద పెద్ద రూములు, విశాలమైన లైబ్రరీ, వివిధ కమిటీల గదులు చాలా విశాలంగా వున్నాయి.

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవనం దాదాపుగా పూర్తవడానికి సిద్దమైంది. మార్చి మాసంలో దీనిని ప్రారంభిస్తారన్న ఊహాగానాలు కూడా వున్నాయి. అలాగే బడ్జెట్ రెండో దఫా సమావేశాలు నూతన పార్లమెంట్ భవనంలోనే జరుగుతాయన్న ప్రచారమూ నడుస్తోంది. అయితే… ఈ భవనానికి తుది మెరుగులు దిద్దుతోంది సెంట్రల్ విస్టా.

సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ పనులు చేపడుతోంది. అత్యంత విశాలమైన హాల్స్, లైబ్రరీతో పాటు పార్కింగ్‌కు కావాల్సినంత స్థలాన్ని కల్పిస్తున్నారు. హాల్స్, ఆఫీసు రూములన్నీ ఆధునిక టెక్నాలజీకి తగ్గట్టు నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనంలో 888 సీట్లు కెపాసిటీతో లోక్‌సభ హాల్‌ను నిర్మించారు. ఇక రాజ్యసభ హాల్‌ను లోటస్ థీమ్ తరహాలో నిర్మించారు. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే రీతిలో దీన్ని కట్టారు












