పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేస్తూ… ట్వీట్ చేశారు. ఆ దేశంలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాకిస్తాన్‌లో వరదలు సృష్టించిన విలయం చూసి చాలా బాధపడ్డానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వీలైనంత వేగంగా పాక్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా మోదీకి ధన్యవాదాలు ప్రకటించారు. పాక్ లో ఏర్పడ్డ ఆస్తి, ప్రాణ నష్టాలపై స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వరదల వల్ల ఏర్పడ్డ నష్టాన్ని అధిగమించడానికి తాము ప్రయత్నిస్తున్నామని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
వరదలు, వర్షాలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తోంది. వరదలతో దాదాపు 3.30 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ ఆదుకోవాలని, 16 కోట్ల డాలర్ల సాయం అందించాలని పాక్ ఐక్యరాజ్య సమితిని కోరింది. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చడానికి తమకు 1,000 కోట్ల డాలర్లు అవసరమని పాక్ మంత్రి పేర్కొన్నారు. విరాళాల సేకరణలో దాదాపు 500 కోట్లు వచ్చాయని మాజీ ప్రధాని ఇమ్రాన్ పేర్కొన్నారు.
https://twitter.com/CMShehbaz/status/1564998466522210305?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1564998466522210305%7Ctwgr%5Eb7477576151218588f0b675972dca3e30cf8a125%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.v6velugu.com%2Fafter-pm-modis-tweet-on-pakistan-floods-pak-counterpart-responds