తల్లి ప్రేమించే బిడ్డ రూపానికి ఊలు కళే ఊపిరి

సామాన్యులు ప్రకృతిని కళ్లతో చూస్తారు.
చిత్రకారులు మాత్రం మనసుతో చూస్తారు.
చిత్రకారులు కుంచెతో అమ్మ బొమ్మ వేస్తారు.
ఈ చిత్రకారిణి అమ్మ మనసును చిత్రిస్తోంది.
పిల్లల ముఖంలో భావాలే ఆమె బొమ్మలు.
ఉలెన్‌తో ప్రయోగం ఆమె సరికొత్త మాధ్యమం.

మానసప్రియ తెలుగు మహిళ. ప్రస్తుతం పూనాలో ఉంటున్నారు. ఆమె పుట్టింది, పెరిగింది కర్నాటకలోని బళ్లారిలో. ఆమె పూర్వికులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్నాటకకు వెళ్లారు. అలా మానసప్రియ మూలాలు తెలుగు నేలతో ముడివడి ఉన్నాయి. ఆమె చక్కటి తెలుగు మాట్లాడుతారు కూడా.


చిత్రలేఖనం పట్ల ఆసక్తి చిన్నప్పటి నుంచే మొదలైంది. స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి ఆమె మంచి చిత్రకారిణి. పోటీల్లో ప్రైజులు తెచ్చుకున్నారు. రొటీన్‌ చదువు పట్ల ఆసక్తి కనబరచడం లేదని తెలుసుకున్న ఆమె చిన్నాన్న మానసను హైదరాబాద్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌లో చేర్పించారు. అలా ఆమె హైదరాబాదు లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వావిద్యాలయం నుంచి బీఎఫ్‌ఏ చేశారు. ఆ తర్వాత బెంగళూరులో విజువల్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ చేశారు. మహిళ ఎన్ని చదివినా, ఎంత సాధించినా తల్లిగా తన బాధ్యతను నిర్లక్ష్యం చేయరాదని నమ్ముతారామె. అందుకే పెళ్లి తర్వాత కొంతకాలం తన కెరీర్‌లో విరామం తీసుకున్నారు.

తొమ్మిదేళ్ల తర్వాత
పిల్లలిద్దరూ స్కూలుకెళ్లడం మొదలైన తర్వాత మానసప్రియకు ఇంట్లో కొంత ఖాళీ సమయం దొరికేది. ఆ సమయంలో ఆమె తన సృజనాత్మకతకు పదును పెడుతూ టెర్రారియమ్‌ వంటి (గాజు కుండీలో మొక్కలు పెంచడం) కళలను ప్రాక్టీస్‌ చేసేవారు. అలా ఉన్న సమయంలో ఒక ఫ్రెండ్‌ ఆహ్వానం మేరకు కేరళలో చిత్రలేఖనం ప్రదర్శనలో తన చిత్రాలను ప్రదర్శించారు. అప్పుడు ఆమె అందుకున్న ప్రశంస నూతనోత్తేజాన్నిచ్చింది. తాను శాస్త్రబద్ధంగా నేర్చుకున్న చిత్రలేఖనానికి కొత్త సొబగులద్దాలనుకుంది. అలా మొదలయిందే క్రోషియోఉలెన్‌ ఆర్ట్‌.

తల్లి ప్రేమించే పిల్లల రూపం
ఉలెన్‌ ప్రయోగం కోసం విస్తృతంగా ఎక్సర్‌సైజ్‌ చేశారామె. తన ప్రయోగం ద్వారా ఆవిష్కరించే చిత్రాలు కూడా వినూత్నంగా ఉండాలనుకున్నారు. నిద్రపోతున్నప్పుడు పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు. తల్లి తన పిల్లల్ని ఇష్టంగా చూసుకునేది అప్పుడే. పిల్లల ముఖంలో ఉండే ఆ ప్రశాంతత, స్నిగ్ధత్వంలో ఉండే అందాన్ని ఒడిసి పట్టుకున్నారు మానస ప్రియ. తన స్నేహితులను అడిగి వాళ్ల పిల్లల ఫొటోలు తెప్పించుకున్నారు. తల్లి తన పిల్లలను ఏ పోజ్‌లో ఎక్కువ ఇష్టపడుతుందో ఆ ఫొటోలను సేకరించి వాటిని ఉలెన్‌లో అల్లారు. ముఖంలో భావాన్ని ఊలులో అల్లడం ఆమె తనకు తానుగా సాధించిన ప్రతిభ. ఇలా అల్లిన పద్నాలుగు చిత్రాలతో గత నెలలో ప్రదర్శన పెట్టారు. బెంగళూరులోని కర్నాటక చిత్రకళాపరిషత్, దేవరాజ్‌ అర్స్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఆమె నిర్వహించిన సోలో ఎగ్జిబిషన్‌కి విశేషమైన స్పందన వచ్చింది. అరవై ఏళ్లు దాటిన ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఆమె బొమ్మలు చూడడానికే వచ్చారు. కెనడా నుంచి వచ్చిన ఓ సిస్టర్‌ని ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గ్యాలరీకి తీసుకువచ్చి మరీ ఆమెకు ఈ చిత్రాలను చూపించారు.

పిన్ని కోసం ప్రదర్శన
మానస ప్రియ ఈ ఉలెన్‌ ఆర్ట్‌ కోసం ఐదేళ్లు కష్టపడ్డారు. ఒక చిత్రం అయితే పదకొండు అడుగుల ఎత్తు ఉంది. ప్రేక్షకులు తలెత్తి చూడాల్సిందే. ‘‘నా ప్రయోగాన్ని మా సీత పిన్ని ఎంతో ఆసక్తిగా గమనించేవారు, నేను ఎగ్జిబిషన్‌ పెడితే చూడాలని ఆమె ఎంతగానో ఎదురు చూశారు. దురదృష్టం ఏమిటంటే ఆమెకు క్యాన్సర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లోకి వచ్చేసింది. మేము తెలుసుకునేటప్పటికే ఆలస్యం అయింది. ఆమె ఉండగానే ఎగ్జిబిషన్‌ పెట్టాలని రాత్రింబవళ్లు పని చేశాను. రెండేళ్లపాటు రోజుకు నాలుగు గంటల నిద్రతోనే పని చేశాను. కానీ పిన్ని ఉండగా పూర్తికాలేదు. గత ఏడాది ఆమె పోయారు. ఆమె తొలి సంవత్సరీకం నాటికి ఎగ్జిబిషన్‌ పెట్టాలని పట్టుపట్టి పూర్తి చేశాను’’ అని తన ప్రయోగాన్ని పిన్నికి అంకితం చేసినట్లు చెప్పారు మానసప్రియ.
– మను

Related Posts

Latest News Updates