ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష టీడీపీ స్పందించింది. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదని పీఏసీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేకపోయిందని నిలదీశారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రిని పొగిడించటమేంటని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా లేక ముఖ్యమంత్రి పెద్దా అని అడిగారు. ప్రథమ పౌరుడితో సీఎంను పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారన్నారు. స్పీకర్ కార్యాలయంలో గవర్నర్ వేచి వుండేలా చేశారని, అది నిబంధనలకు విరుద్ధమంటూ మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందన్నారు. నవరత్నాలతో ఏపీ ప్రజలకు డైరెక్టుగా నిధులు అందించామన్నారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్లో ఉందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రతి ఏటా 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్దిరేటు సాధించిందని పేర్కొన్నారు. ఏపీలో తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలకు పెరిగిందన్నారు.












