ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు విరుచుకుపడుతున్నారు. నేటి ఉదయం నుంచి ఏపీ, తెలంగాణ, యూపీ, కేరళ, కర్నాటక, తమిళనాడుతో సహా మొత్తం 10 రాష్ట్రాల్లో ఈడీ, ఎన్ఐఏ తనిఖీలు చేసింది. పీఎఫ్ఐ, ఎస్డీపీఐకి చెందిన 100 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ మొత్తం ఆపరేషన్ అంతా కూడా కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలోనే సాగుతోందని అధికారులు తెలిపారు. పీఎఫ్ఐ కార్యకలాపాలు తెలంగాణ, ఏపీ జిల్లాల్లో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యం ఏర్పడింది.
వీరందరూ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు నిధులను కూడా అందజేస్తున్నారని ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా పీఎఫ్ఐ లో చేరాలంటూ ప్రోత్సహిస్తున్న వారిపై కూడా ఎన్ఐఏ కన్నేసింది. అలాంటి వారిని కూడా అరెస్ట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో దాడులు జరగడం ఇదే ప్రథమమని అధికారలు పేర్కొన్నారు. మరోవైపు పీఎఫ్ఐతో సంబంధమున 9 మందిని అసోం పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ, స్థానిక పోలీసులు కలిసి, ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇక.. అరెస్టైన వారందరూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉగ్రవాద నిధుల సేకరణ, శిక్షణ; క్యాంపుల నిర్వహణ వంటి చేస్తున్నారని అధికారులు పేర్కొంటు్నారు. యూఏఈ, ఓమన్, కతార్, సౌదీ అరేబియాల నుంచి కూడా నిధులు సేకరించేందుకు పీఎఫ్ఐ కమిటీలను కూడా నియమించింది. హవాలా మార్గాల్లో అక్రమంగా నిధులను తరలిస్తోంది. ఇక… ఈ దాడుల్లో 600 మందికి పైగా బ్యాంకు ఖాతాలను ఈడీ తనిఖీలు చేసింది. 2,600 మందికి లబ్ధిదారుల ఖాతాలను కూడా పరిశీలించింది.