డిసెంబర్ 14తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 14న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో సీఎం కేసీఆర్ ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా యాగం చేపట్టనున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టవలసిన మరమ్మత్తులు, కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు. మరికొందరు పార్టీ నేతలు నేడు, రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా హాజరుకానున్నట్టు సమాచారం.












