దేశం ప్రాథమిక అంశాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోంది : మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవం దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాగే దేశంలోని అన్ని పీసీసీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ద్వేషానికి వ్యతిరేకంగా అందరూ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. తాము అందర్నీ కలుపుకొని వెళ్లేవారమని, అందుకే భారత్ అభివృద్ధి చెందిందని వివరించారు. ఇలా అందర్నీ కలుపుకొని వెళ్లడం వల్ల బలమైన ప్రజాస్వామ్య దేశంగా అవతరించడమే కాకుండా… ఆర్థిక, అణు, వ్యూహాత్మక రంగాల్లో సూపర్ పవర్ గా ఎదిగిందని వివరించారు.

అయితే.. ఈ అభివృద్ధి అంతా దానంతటదే జరగలేదని, తమ పార్టీ అనుసరించిన విధానాలు, సమ్మిళిత సిద్ధాంతం, రాజ్యాంగం పై తమకున్న నిబద్ధత ఇదంతా చేయించిందని తెలిపారు. దేశం ప్రాథమిక అంశాలపై బీజేపీ ప్రభుత్వం నిరంతరం దాడి చేస్తూనే వుందని, విద్వేషంతో సమాజాన్ని చీలుస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల ఇబ్బందులు పెడుతున్నా… ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఐకమత్యంగా వుండి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సూచించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కార్యకర్తలకు సంజీవిని లాగా పనిచేసిందని, ప్రజల నుంచి మద్దతు వచ్చిందని ఖర్గే అన్నారు.

Related Posts

Latest News Updates