యూపీ గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు., శనివారం రాత్రి పోలీసులు అతడిని ప్రయాగ్ రాజ్ లోని ఆస్పత్రికి మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా… ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో అతని సోదరుడు అష్రఫ్ కూడా మరణించాడు. అతీక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా… అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు ఈ ఇద్దరిపై అతి సమీపం నుంచే కాల్పులు జరిపారు. దీంతో స్పాట్ లోనే వీరిద్దరూ హతమయ్యారు.
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ హత్యలపై వారు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు ఈ ఘటనతో ఆస్పత్రి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇప్పటికే అతీక్ మూడో కుమారుడు అసద్ ను గురువారమే యూపీ పోలీసులు ఝాన్సీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేశారు. అతని అంత్యక్రియలు శనివారం ఉదయమే ముగిశాయి.
గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ హత్య నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసు అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని పోలీసులు మాత్రం హైఅలర్ట్ గా వుండాలన్నారు.
సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శాంతిభద్రతలను కాపాడాలని అధికారులను ఆదేశించారు. అయితే.. ప్రజలెవ్వరూ అనవసరమైన పుకార్లను నమ్మవద్దని, పుకార్లను వ్యాప్తి చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీల మొదలు… కింది స్థాయి వరకూ పోలీసులందరూ విధుల్లోనే వుండాలని, సున్నిత ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని కూడా ఆదేశించారు. ఇక… అతీక్ హత్య జరిగిన ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో పోలీసులు ఇప్పటికే కవాతు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.