ఇండోర్ నగరంలోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి పైకప్పు కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 35కు పెరిగింది. శ్రీరామనవమి సందర్భంగా బాలేశ్వర్ ఆలయంలోని ఆవరణలో కల్యాణం కోసం కూర్చున్నారు. స్థలం సరిపోకపోవడంతో… ఆలయ ప్రాంగణంలోనే వున్న మెట్ల బావిపై కూడా కొందరు భక్తులు కూర్చున్నారు. బరువు బాగా పెరగడంతో బావి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఈ ఘోరం జరిగిపోయింది. అయితే… ఈ సమాచారం అందుకున్న పోలీసులు… వెంటనే అక్కడికి చేరుకున్నారు.
పోలీసులు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగానే ఈ బావిలో పడిపోయారు. ఇప్పటి వరకూ 35 మంది చనిపోయారు. మరో 16 మందిని సహాయక సిబ్బంది రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకూ 35 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. 75 మంది ఆర్మీ సిబ్బందితో సహా 140 మంది బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిస్థితిని పరిశీలించి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇండోర్‌లో జరిగిన దుర్ఘటన చాలా బాధ కలిగించిందని మోదీ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.