చెన్నైలోని టి. నగర్ ఆంధ్రాక్లబ్ లో ఎన్టీఆర్ అభిమానులు, ఆస్కా మాజీ అధ్యక్షుడు మాదాల ఆదిశేషయ్య సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. దీనికి బెంగళూరుకు చెందిన అఖిల భారత తెలుగు అకాడమీ అధ్యక్షులు గారపాటి రామ కృష్ణ అధ్యక్షత వహించగా, టీడీపీ సీనియర్ నేత, నటుడు మురళీ మోహన్, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామ కృష్ణ, కాట్రగడ్డ ప్రసాద్, శ్రీనివాస డైరీ చైర్మన్ బ్రహ్మానందం, జయ గ్రూపు సంస్థల చైర్మన్ కనకరాజు, నటీమణులు రాజశ్రీ, జయమాలిని, సినీ గేయరచయిత భువనచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఇతర రాజకీయ నేతల్లాగా వారసత్వంతో రాలేదని, సొంతంగా కష్టపడి వచ్చారన్నారు. కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారని నటుడు మురళీ మోహన్ పేర్కొన్నారు. నటుడిగా, సీఎంగా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. చెన్నైలోని టి. నగర్ లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మురళీ మోహన్ కోరారు.
ఇక.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిశేషయ్య మాట్లాడుతూ… తాను ఎన్టీఆర్ వీరాభిమానినని చెప్పుకున్నారు. ఆయన నటించిన మాయాబజార్, లవకుశ సినిమాలు చూసేందుకు చిన్న తనంలో చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. శ్రీరాముడిగా, కృష్ణుడిగా ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలిపారని, ఆ గౌరవం వారికే దక్కుతుందని అన్నారు.
ఇక… ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామ కృష్ణ మాట్లాడుతూ.. శ్రీరాముడు, శ్రీకృష్ణ పాత్రతో ప్రజల్లో చిరస్థాయిగా తన తండ్రి నిలిచిపోయారని ప్రకటించారు. ఎన్టీఆర్ నేటి తరానికి ఓ ఎన్ సైక్లోపీడియా అని అన్నారు. చైన్నై నగరానికి, తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం వుందని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఎక్కువ కాలం చెన్నైలోనే గడిపారని గుర్తు చేసుకున్నారు. ఇక.. ఈ కార్యక్రమంలో గీత రచయిత భువన చంద్ర, నర్తకి జయమాలిని, అలనాటి నటి రాజశ్రీకి ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు.