స్విట్జర్లాండ్ వేదికగా జరుగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు వారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రవాసీయులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. తాను కూడా ఓ ప్రవాస భారతీయుడినేనని అన్నారు. కొంత కాలం విదేశంలో పనిచేసి, తిరిగి భారత్ కి వెళ్లానని గుర్తు చేసుకున్నారు. దావోస్ వచ్చిన ప్రతిసారీ స్విట్జర్లాండ్ ప్రవాసీయులు ఇచ్చే మద్దతు చాలా గొప్పగా వుంటుందని, అందుకు ధన్యవాదాలు ప్రకటిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ప్రవాసీయులు ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర, సమ్మిళితంగా ముందుకు వెళ్లోందని వివరించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన పనితీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్నాయన్నారు.
మానవ జీవితం పరిమితంగానే వుంటుందన్న సిద్ధాంతాన్ని తాను బలంగా నమ్ముతానని, అందుకే సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ప్రయత్నాలు చేస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఒక వైపు పల్లె ప్రగతి, మరోవైపు పట్టణ ప్రగతి ద్వారా పల్లెలు, పట్టణాలు సైతం దేశంలో ఆదర్శ గ్రామాలు, పట్టణాలుగా గుర్తింపు పొందాయని అన్నారు. తాము చేపట్టిన అన్ని లక్ష్యాలను పూర్తి చేసి, భారత్ లో తెలంగాణను ఓ ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ పేర్కొన్నారు.