సరిహద్దు సమస్యపై రాజకీయం చేయడం తగదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హితవు పలికారు. ప్రత్యక్షంగా గానీ… పరోక్షంగా గానీ.. మన సైన్యాన్ని విమర్శించవద్దని, సరిహద్దుల్లో తీవ్ర ప్రతికూలతల మధ్య మన జవాన్లు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సముద్రపు దొంగతనాల నిరోధక బిల్లుపై లోక్ సభలో మాట్లాడుతూ.. జైశంకర్ పై వ్యాఖ్యలు చేశారు. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేయాలని ప్రయత్నిస్తే… భారత సైన్యం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సరిహద్దుల వెంట గతంలో ఎన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో మన బలగాలను మోహరించామని ప్రకటించారు.
ప్రధాని మోదీ ఆదేశాలతోనే సైన్యం అక్కడుందని, అంతేగానీ.. రాహుల్ గాంధీ చెబితే కాదని చురకలంటించారు. ఎల్ఏసీవెంట మన భూభాగాలను చైనా ఆక్రమించిందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. సాధారణ పరిస్థితి కోసం నిరంతరం చైనాపై ఒత్తిడి తెస్తూనే వున్నామని, నిర్లక్ష్యం వహించడం లేదని స్పష్టం చేశారు. చైనా సైన్యం చేతిలో మన సైనికులు దెబ్బలు తిన్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తీవ్రంగా తప్పుబట్టారు. మన సైనిల విషయంలో పిటై అన్న పదాన్ని వాడకూడదని సూచించారు. చైనా పట్ల ఉదాసీనంగా తాము వుంటే… మరి సరిహద్దుల్లోకి జవాన్లను ఎవరు పంపారని విరుచుకుపడ్డారు.