ఎర్రకోట మీది నుంచి టాయిలెట్ల గురించి మాట్లాడింది మోదీ ఒక్కరే : రాంనాథ్ కోవింద్

ఎర్రకోట వేదికగా మరుగుదొడ్ల గురించి మాట్లాడిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీయేనని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొనియాడారు. టాయిలెట్ల గురించి గతంలో ఏ ప్రధాని కూడా ఊసెత్తలేదన్నారు. సోషియాలజీ ఆఫ్ శానిటేషన్ జాతీయ సమావేశంలో కోవింద్ మాట్లాడుతూ పరిశుభ్రత, పారిశుధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మోదీ చెప్పారన్నారు. గాంధీ కూడా పరిశుభ్రత గురించే ఎక్కువగా మాట్లాడేవారని గుర్తు చేశారు. పరిశుభ్రత గురించి ఎవరైనా అర్థం చేసుకున్నారంటే అది ప్రధాని మోదీయే అని ఆయన స్పష్టం చేశారు. ఎర్రకోట వేదికగా మరుగుదొడ్ల గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తే ఎగతాళి చేశారని, కానీ మోదీ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదన్నారు. ఇప్పుడు ఫలితాలు చూస్తున్నామన్నారు.

ఇక… సోషియాలజీ ఆఫ్ శానిటేషన్ జాతీయ సమావేశం మూడు రోజుల పాటు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి వైస్ చాన్స్​లర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సులభ్ ఇంటర్నేషనల్ కు చెందిన సులభ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్​ యాక్షన్ సోషియాలజీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నది. శుభ్రంగా ఉండడమంటే దేవుడికి దగ్గరగా ఉండడమేనని గాంధీ అనేవారని కోవింద్ గుర్తు చేశారు.

 

మనసు పరిశుద్ధంగా లేకపోతే, దేవుడి ఆశీర్వాదం పొందలేమని, అలాగే మన శరీరం శుభ్రంగా లేకపోయినా భగవంతుడు ఆశీర్వదించడు. అపరిశుభ్రమైన ప్రాంతంలో ఉంటే మన శరీరం ఎలా శుద్ధంగా ఉంటుంది? అని కోవింద్ ప్రశ్నించారు. పారిశుధ్యాన్ని సామాజిక మార్పుకు ఒక సాధనంగా అధ్యయనం చేయాలని చెబుతూ అందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవాలని మాజీ రాష్ట్రపతి సూచించారు. పారిశుధ్యం, దాని అధ్యయనాల కోసం విధానాలను రూపొందించాలని విద్యావేత్తలను ఈ సందర్భంగా కోవింద్ కోరారు. శానిటేషన్, సామాజిక సేవల్లో సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఈ సమావేశం విజయవంతం కావాలని ప్రధాని మోదీ సందేశం పంపించారు.

Related Posts

Latest News Updates