ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే భారత్ మాత్రం క్రెమ్లిన్ నుంచి ఇంధన కొనుగోళ్లను చేస్తుండటంపై కొన్ని విమర్శలు వచ్చాయి. వీటిపై కేంద్ర పెట్రోలియ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. దేశ పౌరులకు అవసరమైనంత ఇంధనాన్ని అందించాల్సిన బాధ్యత మా ప్రభుత్వ నైతిక బాధ్యత అని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపాలని ఏ దేశమూ తమకు చెప్పలేదని స్పష్టం చేశారు.
విధానాలపై స్పష్టత వుంటే.. ఏ దేశం నుంచైనా చమురును కొనుగోలు చేయవచ్చని అన్నారు. భారత్ లో చమురు వినియోగం ఆధారంగానే తమ ప్రభుత్వం కొనుగోళ్లను చేస్తుందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని హర్దీప్ సింగ్ పురి అన్నారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు ఏప్రిల్ నుంచి 50 రెట్లు పెరిగాయని.. ఇది భారత్ విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురులో 10 శాతం ఉందని హర్దీప్ సింగ్ తెలిపారు.