ఛత్రపతి శివాజీ మహారాజ్ విషయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ప్రకంపనలే రేపుతున్నాయి. నితిన్ గడ్కరీ, శివాజీ మహారాజ్ విషయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ వర్గం తీవ్ర విమర్శలు చేస్తోంది. గవర్నర్ ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇంతకింతకూ ముదురుతుండటంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. శివాజీ మహారాజ్ మాకు దేవుడు. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన్ను పూజిస్తాం అంటూ ప్రకటన చేశారు. అంతేకాకుండా సీఎం ఏకనాథ్ షిండే తీరును కూడా గడ్కరీ తప్పుబట్టారు.

అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వ విద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్రలో చాలా మంది ఆరాధ్య నాయకులు వున్నారని, శివాజీ మహారాజ్ పాతకాలం నాటి ఆరాధ్య దైవం అనే అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అంబేద్కర్, నితిన్ గడ్కరీ ఈ కాలంలో బాగా క్రేజ్ వున్న నేతలు అంటూ గవర్నర్ కోషియారీ వ్యాఖ్యానించారు. దీంతో వివాదం రేగింది.












