కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ షాక్ ఇచ్చింది. వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఏమాత్రం పాటించనందుకు గాను రూ.3825 కోట్ల జరిమానా కట్టాలని ఆదేశాలిచ్చింది. రోజుకు 1824 మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ధి వ్యత్యాసానికి గాను రూ.3648 కోట్లు, ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించనందుకు రూ.177 కోట్లు కలిపి మొత్తం రూ.3825 కోట్ల పరిహారాన్ని విధిస్తున్నట్లు తెలిపింది. రెండు నెలల్లో ఈ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ఎన్జీటీ ఆదేశించింది.
పర్యావరణ పునరుద్ధరణ కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని స్పష్టం చేసింది.వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టి.. పురోగతి చెప్పాలని ఆదేశించింది. పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ పిటిషన్ పై విచారించిన ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 1996లో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు 2014లో ఎన్జీటీకి బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్య నివారణపై మరో పిటిషన్ దాఖలైంది.
1996లో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు 2014లో ఎన్జీటీకి బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్య నివారణపై మరో పిటిషన్ దాఖలైంది.100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలపై చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక, మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. అన్ని రాష్ట్రాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై 1996 నుంచి విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2014లో ఎన్జీటీకి కేసును బదిలీ చేసింది.
8 ఏళ్లుగా విచారణ జరుపుతున్న ఎన్జీటీ.. పలుసార్లు తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) స్వయంగా రెండు సార్లు విచారణకు హాజరయ్యారు. అయినా తాము జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఎన్జీటీ గుర్తించింది.