పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏండ్ల క్రితం జరిగిన హత్య కేసులో సంవత్సరం శిక్ష పడటంతో 10 నెలల జైలు జీవితాన్ని అనుభవించిన సిద్ధూ శిక్షాకాలం కన్నా రెండు నెలల ముందుగానే విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్లో రాష్ట్రపతి పాలన పెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఎప్పుడైతే దేశంలో నియంతృత్వం ప్రబలుతుందో, అదే సమయంలో విప్లవం కూడా వస్తుందని, ఆ విప్లవం పేరే రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. సిద్ధూ విడుదలను పురస్కరించుకుని అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు పాటియాలా జైలుకు పెద్దఎత్తున తరలివచ్చారు. జైలు వెలుపల అనేక మంది కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు నిలుచుని ‘నవజోత్ సిధు జిందాబాద్’ అని నినాదాలు చేశారు. . నవజోత్ సింగ్ సిధుకు సంబంధించిన పోస్టర్లు కూడా పాటియాలలోని అనేక చోట్ల కనిపించాయి. ‘సిధు ఎప్పుడు జైలు వెలుపలికి వస్తారా అని పంజాబ్ ప్రజలు ఎదురుచూస్తున్నారు’ అని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంఎల్ఏ నవతేజ్ సింగ్ చీమా తెలిపారు.