నవరసాల్లో శృంగారమే రసరాజమా!

అన్ని రసాలు ప్రాముఖ్యమైనప్పుడు ఒక్క శృంగార రసానికి మన పూర్వికులు ఎందుకింత ప్రాముఖ్యత కల్పించారు అనే విషయం పై నా వివరణ ఇది…
నవరస మాధుర్యం
రసాలు తొమ్మిది అని అందరికీ విదితమే…
శృంగారం, వీర, కరుణ, అద్బుత, హాస్య, భీభత్స, భయానక, రౌధ్ర, శాంత ఇలా తొమ్మిదిని మనం పేర్కొనవచ్చు.. అయితే ఈ తొమ్మిదీ ఒకదానికొకటి తీసిపోనివి.. సమాన ప్రతిపత్తి కలవి కాబట్టే “నవ రసాలు” గా పేర్కొనబడ్డాయి…పేరు గావించబడ్డాయి… అయినా ప్రాచీన కాలంలోనే ప్రముఖ సాహిత్య శాస్త్రజ్ఞులు “శృంగారంరసరాజం” అన్నారు.. వారిమాట తేలిగ్గా తీసుకోలేకపోయాను. అలానే త్రోసిపుచ్చడానికి కూడా మనసు ఒప్పుకోలేదు.. దీనికి సరైన వివరణ తెలుసుకోవాలనిపించింది..
నా ప్రశ్న ఏమిటంటే..రసాలన్నీ ఒక్కటేనన్నప్పుడు రసరాజంగా కేవలం ఒక్క రసానికే విశిష్టస్థానం, ప్రాముఖ్యతను ఏవిధంగా ఇచ్చారు ఈ పండితులు అని ??
ఇంతకీ వారు ప్రధమ స్థానం ఇచ్చింది ఏ రసానికో మీకు ఈపాటికే తెలిసేవుంటుంది అదేనండి “శృంగార రసం” దీనిపై చాలారోజులనుంచి వివరణకోసం నా నయనములు వెతుకుతున్నాయి.. అందుకోసం పరితపిస్తున్నాయి.. చివరికి నాకు మింగుడుపడే సమాధానం నాకు దొరికింది..
రసాలన్నిటికీ మానవుని జీవితంతో సంబంధం వున్నది.. కాని శృంగారేతర రసాల కంటే ఒక్క శృంగార రసానికి మాత్రమే మానవుని జీవితాలలోనే కాదు.. సమస్త ప్రాణికోటి బ్రతుకులలోనే.. కాదు కాదు.. అసలు సృష్టిలోనే ప్రత్యేకమైనదిగాను. అసాధారణమైన, అఖండమైన స్థానం కలిగి ఉన్నది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు…
వీర, కరుణ, అద్బుత, హాస్య, భీభత్స, భయానక, రౌధ్ర, శాంత ఈ ఎనిమిది రసాలలో ఏ రసం లేకపోయినా ఈ యావత్తు అష్ట రసాలు లేకపోయినా సృష్టిలో వచ్చే వైపరీత్యం ఏమీ ఉండదు, ఉండబోదు.. అయితే శృంగారమే లేకపోతే సామాన్యంగా మానవుని బ్రతుకుకే కాదు, అసలు సృష్టికే – ప్రత్యేకించి ప్రాణకోటి సృష్టికే వైపరీత్యం ఏర్పడుతుంది… రసోత్పత్తి మీద ఆధారపడి సృష్టి కార్యం అంతా జరుగుతున్నది.. ఇది కొరవడినప్పుడు ప్రాణి సృష్టికే స్థంబన ఏర్పడుతుంది. పవిత్ర శృంగారం నీచము కాదు… అది ఓ మహత్తర బృహత్కార్యం.. శృంగారం అనేది ప్రాణి సృష్టి స్వభావానికి ప్రతిబింబం కేంద్ర బింబం కూడాను.. అది కేవలం ప్రకృతి స్వభావం.. అటువంటి దాన్ని మనం ఆపాలని ప్రయత్నిస్తే మనమే ఓటమిని అంగీకరించక తప్పదు.. ప్రకృతి సిద్దమైన దాంపత్య జీవితాలకు బౌద్ద మతం స్వస్తి చెప్పినందువల్లనే క్రమంగా బౌద్ధారామాలలోనే పతనస్థితి ఏర్పడి చివరికి బౌద్డమే దెబ్బతింది.. ఎక్కడో ఎవరో “తురీయాశ్రమ స్వీకరణ”తో ఏ ఒక్కరో, ఇద్దరో, పదుగురో సృష్టి కార్యాన్ని దీక్షగా పడితే నష్టం ఉండదు, ఉండబోదు.. కానీ అదే ఒక ఉద్యమ రూపందాల్చి కనపడిన ప్రతీ వ్యక్తికీ సన్యాసాశ్రమం ప్రసాదించే పరిస్థితి వస్తే ప్రకృతి సిద్దమైన, స్వభావ బద్ధమైన శృంగారానికి లోబడక తప్పదు.. సన్యాసం కళంకాంకితం కాక తప్పదు..ప్రకృతిసిద్దమైన శృంగారపరమైన శక్తిని ఆపడం సృష్టికే విరుద్దం.. సృష్టి వ్యవస్థతోనే శృంగారానికి అవినాభావ సంబంధం, అఖండమైన సంబంధం ఉంది..
అందువల్లనే మన పూర్వీకులు, ప్రాచీనులు, సకల శాస్త్రోత్తములు, సంభృతశ్రుతులు “శృంగారం రసరాజం” అని వాగ్ధాటించారు.. వాస్తవానికి అది రసరాజం మాత్రమే కాదు రసనైజం, నైజరసం శృంగార రసానికున్న ఈ వైశిష్ట్యాన్ని దృష్టిలో పెట్టుకునే మన పూర్వీకులు ప్రధమ స్థానం కల్పించారు.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు

Related Posts

Latest News Updates