ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో అడవిబిడ్డల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో వేడుక మొదలైంది. ఉదయం 11 నుంచి అర్ధరాత్రి 12 వరకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ముందుగా మైసమ్మ దేవతకు ఆ తర్వాత నాగోబా, సతీ, బాన్ దేవతలకు మొక్కుకున్నారు. 22 కితలకు చెందిన మెస్రం వంశీయుల మహిళలకు మట్టికుండలు పెద్దల చేతులమీదుగా పంపిణీ చేశారు. గోవాడ్లో ప్రవేశం చేసిన మహిళలు 22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసి మహాపూజలకు అవసరమైన నైవేద్యాన్ని తయారు చేశారు. మహాపూజలకు అరగంట ముందు నాగోబా ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. పవిత్ర గంగాజలంతో ఇష్ట దేవతను అభిషేకించారు. రాత్రి 10 గంటల తర్వాత వెలిగించిన కాగడాలతో గోవాడ్ నుంచి నాగోబా ఆలయానికి వాయిద్యాలు వాయిస్తూ చేరుకున్నారు. నేడు నాగోబాను కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకోనున్నారు. అనంతరం ఆదివాసులతో అర్జున్ ముండా భేటీ కానున్నారు. ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో నాగోబా జాతరకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల 28 వరకు జాతర కొనసాగనుండగా, ఉమ్మడి జిల్లా నుంచేగాక వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు.