మునుగోడు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్… మధ్యాహ్నం 12 గంటల వరకూ 30 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 41.3 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. ఇక… మునుగోడులో స్థానికేతరులు తిష్ఠ వేశారన్న ఫిర్యాదులు ఈసీకి భారీ సంఖ్యలో అందాయి. దీంతో ఇప్పటి వరకూ 42 మంది స్థానికేతరులను బయటికి పంపించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఓ పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్, మరో కేంద్రంలో ఈవీఎం సమస్య తలెత్తితే సరిచేశామని ప్రకటించారు. ఓటుకు డబ్బు ప్రస్తావన రావడం అత్యంత దురద్రుష్టకరమని అన్నారు. ఇక… సర్వేల్ లో ఎన్నికల కమిషన్ మహిళా మోడలింగ్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనిని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.

 

ఓటర్లకు ప్రలోభాలంటూ… ఈసీకి ఫిర్యాదు చేసిన బండి సంజయ్

మునుగోడులో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు నగదు పంపిణీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి బయటి వ్యక్తులను తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వికాస్ రాజ్ ను కోరారు.

 

స్వతంత్ర అభ్యర్థి కేఏపాల్ పరుగులే పరుగులు…..

ఉప ఎన్నిక సందర్భంగా కేఏ పాల్ పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు పెట్టారు. 100 పోలింగ్ కేంద్రాలను చుట్టేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక… 10 వేళ్లకు 10 ఉంగరాలు ధరించి వచ్చారు. నిజానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వున్న పాల్ కు ఈసీ ఉంగరం గుర్తు కేటాయించింది. ఉగరం గుర్తు కేటాయిస్తే చేతికి ఉంగరాలతో రావడం ఉల్లంఘన కాదా? అని అడగ్గా…. టీఆర్ఎస్ గుర్తు కారు అని, ఆ పార్టీ నేతలు కార్లలో తిరగడం లేదా? అంటూ ప్రశ్నించారు.