అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను వేడుకచేసుకునేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను ప్రకటించింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నది. పురపాలికల్లో వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
వారం పాటు నిర్వహించే ఈ మహిళ వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మార్చి 8 నుంచి వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలన్నింటిని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోవాలని, ఈ మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి కెటిఆర్ అధికారులను కోరారు.