కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు.. కోవర్డు బ్రదర్స్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కమీషన్ల కుటుంబం అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న తాము కోవర్టులమా? అంటూ సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కేటీఆర్ తమపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నానని, అప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారని, ఆయన తన స్థాయిని మరిచిపోతున్నారని ఎంపీ కోమటిరెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ కు తెలంగాణ అంటే తెలుసా? ఎలా వచ్చిందో తెలుసా? ఎవరెవరు ప్రాణాలిచ్చారో తెలుసా? ఎందురు ప్రాణత్యాగం చేస్తే వచ్చిందో తెలుసా? అంటూ ప్రశ్నలు సంధించారు. పదెకరాల భూమి లేని కేటీఆర్కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. రాజకీయమంటే అధికారం అనుభవిస్తూ, కోట్ల అవినీతి చేయడం కాదని వెంకటరెడ్డి అన్నారు. అమరుల ఆత్మలు ఘోషిస్తుంటే, విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేయడం రాజకీయం కాదని దెప్పిపొడిచారు. ఇన్నేండ్లలో ఏ ఒక్క అమరుడి ఇంటికైనా వెళ్లి ఉంటే నాయకుడంటే ఏమిటో కేటీఆర్కు తెలిసేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.