అభివృద్ధి మంచి ప్రణాళికాబద్ధంగా ఉండాలని చెబుతూ స్వాతంత్ర అమృతోత్సవ కాలంలో రాబోయే 25 ఏళ్ళలో పట్టణాభివృద్ధికి రోడ్‌మ్యాప్ తయారీలో మేయర్లు కీలక పాత్ర పోషించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో మంగళవారం జరిగిన మేయర్లు, డిప్యూటీ మేయర్ల మండలి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల దృష్టి కోణంలోనే అభివృద్ధి చేయవద్దని, నిబద్ధతతో అభివృద్ధి చేయాలని మేయర్లకు సూచించారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మేయర్‌గానే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేస్తూ మెరుగైన భారత దేశం కోసం, దాని అభివృద్ధి కోసం ఆయన అడుగుజాడల్లో నడవాలని మేయర్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
నగరాల అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలతో తన ప్రభుత్వాన్ని పోల్చి చెబుతూ 2014 వరకు దేశంలో మెట్రో నెట్‌వర్క్ 250 కిలోమీటర్లు మాత్రమే ఉండేదని ప్రధాని గుర్తు చేశారు. కానీ నేడు ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 775 కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు. అట్లాగే, టైర్-2, టైర్-3 నగరాలు ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయని వివరించారు. దేశ ప్రజలు బీజేపీని బాగా విశ్వసిస్తున్నారని పేర్కొంటూ క్షేత్ర స్థాయి నుంచి కృషి చేయవలసిన కర్తవ్యం, బాధ్యత మేయర్లందరికీ ఉన్నాయని చెప్పారు. మెరుగైన సదుపాయాలను కల్పించాలని, బీజేపీకి నినాదం ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి కృషి’’ని అనుసరించాలని పార్టీ మేయర్లకు హితవు చెప్పారు.