ఢిల్లీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో పార్టీ పరిస్థితి, విస్తరణ, అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, అధ్యక్షుడు నడ్డా, అమిత్ షాతో పాటు జాతీయ కార్యవర్గ సమావేశాల సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఇక… ఈ సమావేశాల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమిత్ షా ప్రకటించారు.

ఇక… ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసం చేస్తూ సభ్యులకు మార్గనిర్దేశనం చేశారు. సార్వత్రిక ఎన్నికలు కేవలం 400 రోజుల దూరంలోనే వున్నాయని…. నేతలందరూ చాలా ఫాస్ట్ గా పనిచేయాలని, కార్యక్షేత్రంలోకి వెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అందరూ పనిచేయాలని మోదీ ఆదేశించారు. అతి విశ్వాసం వుండొద్దని, అయితే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ తిరిగి అధికారంలోకి వస్తున్నామని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. బోహ్రాలు, పాస్మాండాలు, సిక్కులు… ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరి తలుపూ తట్టాలని, అందరికీ చేరువ కావాలన్నారు. ఎన్నికల లబ్ధి కోసం కాకుండా… దేశం క్షేమం కోసం, సంక్షేమం కోసం పాటుపడాలని హితోపదేశం చేశారు.

ఇండియా అత్యుత్తమ శకం రాబోతున్నది. దేశ అభివృద్ధి కోసం పార్టీ తనను తాను అంకితం చేసుకోవాలి. అమృత కాలాన్ని.. కర్తవ్య కాలంగా మార్చుకోవాలి’’అని పార్టీ కార్యకర్తలకు ప్రధాని హితబోధ చేశారు. నేతలు ప్రతి వర్గానికి పూర్తి అంకితభావంతో సేవ చేయాలని చెప్పారు. పార్టీని విస్తరించి, దేశాన్ని ప్రతి అంశంలో నడిపించాలని మోదీ కోరారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులను కలవాలని, వారితో కనెక్ట్ కావడానికి యూనివర్సిటీలు, ఇతర ప్రదేశాలను సందర్శించాలని సభ్యులకు మోదీ సూచించారు.












