ప్రధాని నరేంద్ర మోదీ నేడు రామంగుండం రానున్నారు. రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) ను శనివారం ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా అంతా సర్వం సిద్ధమైంది. ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే సభలో మోదీ ప్రసంగిస్తారు. వేదిక మీద ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీలుంటారు. వేదికపై మూడు, వేదిక కింద ఆరు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు, సీనియర్ ఆఫీసర్ల కోసం నాలుగు చోట్ల తాత్కాలిక వెయిటింగ్ రూమ్‌లను రెడీ చేశారు. సభ ప్రాంతాన్ని ఎస్పీజీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమానితులను పసిగట్టేందుకు సభా ప్రాంగణంలోనూ, చుట్టు పక్కలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
భద్రత ఏర్పాట్ల కోసం రామగుండం కమిషనరేట్ పరిధితోపాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి 2,500 మంది పోలీసులు ఎన్టీపీసీకి చేరుకున్నారు. ఏపీ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ కాసేపు బీజేపీ శ్రేణులతో మాట్లాడుతారు. ఆ తర్వాత ఆయన బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.10 గంటలకు రామగుండం వస్తారు. 3.20 గంటలకు ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌కు చేరుకొని 3.35 గంటల వరకు అక్కడే ఉండి.. ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం 3.45 గంటలకు ఎన్టీపీసీస్టేడియంలోని సభా వేదిక వద్దకు వస్తారు.







