ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు మరికొన్నింటిని జాతికి అంకితం చేసేందుకు విశాఖకు మోదీ చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్, సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు.

ప్రత్యేక విమానాంలో రాత్రి 7.:55 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగా వద్దకు ప్రధాని చేరుకున్నారు. గవర్నర్, సీఎం, స్పీకర్, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు మోదీకి స్వాగతం పలికారు. అనంతరం మారుతి కూడలి నుంచి ఐఎన్ఎస్ చోళా వరకూ బీజేపీ చేపట్టిన రోడ్ షోలో అడుగడుగునా శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.












