నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అతి త్వరలోనే ఐటీ హబ్ ను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. జిల్లా కేంద్రంలో 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కవిత సందర్శించారు. చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో మౌలిక సదుపాయాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ హబ్ లను నిర్మిస్తున్నారని కవిత పేర్కొన్నారు.

 

నిజామాబాద్ లో ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు.రూ. 50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ హబ్‌లో 750 మంది యువతకు, నాలుగు వేల మంది ఇతర ప్రాంతవాసులకు ఉద్యోగ,ఉపాధికి అవకాశం లభిస్తుందని తెలిపారు.ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్ కు రానున్నాయని, ఇప్పటికే 200 పైగా సీట్లు ఒప్పందాలు పూర్తి అయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఐటీ ఎక్స్‌పోర్ట్‌లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉందన్నారు. మరోవైపు జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కవిత చెప్పారు.